నామినేటెడ్ పోస్టుల విధానం రద్దు చేయాలి
పీఏసీఎస్‌లపై రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
తెలంగాణ స్టేట్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు సమ్మయ్య
అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహాసేన నిరసన
ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు
కాకతీయ, శంకరపట్నం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) నామినేటెడ్ పోస్టుల విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహాసేన డిమాండ్ చేసింది. శనివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపి, అనంతరం తెలంగాణ స్టేట్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోడూరు సమ్మయ్య మాట్లాడుతూ గతంలో వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్, డైరెక్టర్ పదవులను రైతులు తమ ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే విధానం అమలులో ఉండేదని గుర్తుచేశారు.
రైతు వ్యతిరేక నిర్ణయంపై మండిపాటు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఎన్నికల హక్కుకు స్వస్తి చెప్పి, నామినేటెడ్ పోస్టుల విధానాన్ని తీసుకురావడం ముమ్మాటికీ రైతు వ్యతిరేక నిర్ణయమని కోడూరు సమ్మయ్య విమర్శించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. నామినేటెడ్ పద్ధతి వల్ల అర్హులైన రైతులకు అన్యాయం జరిగి, పారదర్శకత పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రాజకీయ జోక్యం పెరిగి సాధారణ రైతులు సొసైటీల చుట్టూ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలకులు అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నూతన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో రైతులే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాసేన ప్రతినిధులు, వివిధ బహుజన సంఘాల నాయకులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

