రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
కొమ్మాల గ్రామంలో బైక్‌ను ఢీకొట్టిన భారీ వాహనం
తండ్రీ అక్కడికక్కడే మృతి..చికిత్స పొందుతూ కుమారుడి మరణం
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మల గ్రామ సమీపంలోని గోవర్ధన్ గిరి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు దుర్మరణం పాలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన బాలాజీ (50), ఆయన కుమారుడు నరేష్ (24) కలిసి తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వ్యక్తిగత పనిమీద బయలుదేరారు. జాతీయ రహదారిపైకి రాగానే వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని భారీ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బాలాజీ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడు నరేష్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
గ్రామంలో విషాద చాయలు
మృతుడు నరేష్ బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కొమ్మల గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన భారీ వాహనాన్ని గుర్తించేందుకు హైవేపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

