పురావస్తు మ్యూజియంను సందర్శించిన కలెక్టర్
చారిత్రక అవశేషాలు, పురాతన శిల్పాల పరిశీలన
వారసత్వ సంపదపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ సత్య శారద!
కాకతీయ, వరంగల్ సిటీ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల రెండో రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పురావస్తు శాఖ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక ప్రదర్శనలను, చారిత్రక అవశేషాలను ఆమె పరిశీలించి ఆవిష్కరించారు. మ్యూజియంలో భద్రపరిచిన పురాతన శిల్పాలు, శాసనాలు, చారిత్రక వస్తువుల విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యువతకు చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలోని పలు చారిత్రక అంశాలను, వాటి ప్రాధాన్యాన్ని కలెక్టర్కు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్య రాణి, జడ్పీ సీఈఓ రాంరెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి బాలకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, యువజన ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

