నిబంధనలు పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు!
నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు ఇచ్చేది లేదు
నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హన్మకొండ కలెక్టర్
కొలతలను స్వయంగా తనిఖీ చేసిన చాహత్ బాజ్‌పాయ్
కాకతీయ, వరంగల్ : నగర పరిధిలో భవన నిర్మాణ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటించిన వారికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె నగరంలోని ప్రశాంత్‌నగర్, అశోక్ కాలనీ, సిద్ధార్థ్‌నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో నిర్మించిన పలు భవనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భవన యజమానులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించడంతో పాటు, భవన నిర్మాణ కొలతలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతులకు అవసరమైన పత్రాలు, సాంకేతిక ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు పూర్తిగా అమలైన తర్వాత మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని తెలిపారు. నగర అభివృద్ధితో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. భవన నిర్మాణ దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలిస్తున్నామని, ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే తుది అనుమతులు జారీ చేస్తామని బల్దియా ప్రత్యేక అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అవినాష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

