ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్న కేంద్రం!
కార్పొరేట్‌లకు లాభాలు.. సామాన్యులకు భారాలు
విడతల వారీగా ధరలు పెంచుతూ కేంద్రం కుట్ర
: సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర భారం మోపుతోందని శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కేవలం నాలుగు రోజుల్లోనే లీటరుకు రూ.4 చొప్పున ధరలు పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్య అని పేర్కొన్నారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతుందని హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
విడతల వారీగా పెంచుతూ కుట్ర
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ మాటల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తూ సామాన్యులపై భారం మోపుతోందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి, విడతల వారీగా పెంచుతూ మోసగిస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
నీట్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్ ఘటనపై కూడా కేంద్ర ప్రభుత్వంపై నరేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది, రాష్ట్రంలో 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, దీనికి బాధ్యత వహిస్తూ బీజేపీ నాయకులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లీకుల మాదిరిగానే ప్రస్తుతం కేంద్రంలోనూ పరిస్థితి తయారైందని ఆరోపించారు. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాజొద్దీన్, పిట్టల రవీందర్, మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, చాడగొండ బుచ్చిరెడ్డి, టెల భూమయ్య, సరిల్ల ప్రసాద్, బాలరాజు, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడి రమేష్, మ్యాకల నర్సయ్య, బత్తిని చంద్రయ్య, సుదర్శన్, మాసుం ఖాన్, శ్రీధర్ రెడ్డి, షెహెన్షా, భారీ, బషీర్, ఖలీల్, జమీల్, హనీఫ్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

