పర్యాటక హబ్‌గా ములుగు
99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా హెరిటేజ్ వాక్
కేరళ, రాజస్థాన్ తరహాలో జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాను సమగ్రంగా పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు మండలం జాకారం గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘హెరిటేజ్ వాక్’ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ నుండి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం వరకు ఈ నడక సాగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, దాని చారిత్రక విశిష్టతను పర్యాటక గైడ్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయంతో పాటు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, మేడారం, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యం, బ్లాక్‌బెర్రీ ఐలాండ్ వంటి విభిన్న పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా ములుగు పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
యువతకు ఉపాధి మార్గాలు
పర్యాటక రంగ అభివృద్ధితో స్థానిక యువతకు గైడ్‌లు, స్టాల్స్, పార్కింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, జిల్లా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక రంగాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ ఏడీ బుజ్జి, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, విద్యా శాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి, డీపీఆర్ఓ రఫీక్, తహసీల్దార్ విజయభాస్కర్, సర్పంచ్ దాసరి సమత తదితరులు పాల్గొన్నారు.

