ధాన్యం కొనుగోళ్లపై ఎస్పీ ఆరా
ఏటూరునాగారం డివిజన్లో సుడిగాలి పర్యటన
కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారి
అక్రమాలకు పాల్పడితే జీరో టాలరెన్స్.. కఠిన చర్యలు తప్పవు
రైతు పండించిన ప్రతి గింజకూ పోలీస్ శాఖ అండ
స్పష్టం చేసిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించబోమని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సుధీర్ రామ్నాథ్ కేకాన్ స్పష్టం చేశారు. రైతు పండించిన ప్రతి గింజ సక్రమంగా కొనుగోలు అయ్యే వరకు పోలీస్ శాఖ సంపూర్ణ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గురువారం ఏటూరునాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు, వాజేడు వ్యవసాయ మార్కెట్ ధాన్యాగార నిల్వ కేంద్రాలను ఎస్పీ స్వయంగా సందర్శించి సుడిగాలి తనిఖీలు చేపట్టారు. ఏటూరునాగారం కేంద్రంలో వడ్ల తూకం విధానం, రవాణా ఏర్పాట్లు, లారీల లభ్యతపై ఎస్పీ క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తూకంలో తరుగు పేరిట ఎవరైనా మోసాలకు పాల్పడినా, అవకతవకలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేందుకు వీలుగా రవాణా వాహనాలను తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రత్యేక దిశానిర్దేశం
అనంతరం వాజేడు వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో జరుగుతున్న మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా సురక్షిత గిడ్డంగులకు (గోదాములకు) తరలించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రవాణా వ్యవస్థలో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని, మార్కెట్ పరిధిలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. రైతులు, వ్యాపారస్తులు నష్టపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఆకస్మిక పర్యటనల్లో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, సీఐ శ్రీనివాస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

