రెడ్ అలర్ట్‌లో రుద్రంగి.. భగ్గుమంటున్న మానాల
46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో మండుతున్న రుద్రంగి
రెడ్ అలర్ట్ జాబితాలో రుద్రంగి, మానాల గ్రామాలు
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ నివేదిక ప్రకారం మండలంలోని రుద్రంగి, మానాల గ్రామాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో రెడ్ అలర్ట్ జాబితాలోకి చేరాయి. రుద్రంగి గ్రామంలో గరిష్టంగా 46.0°C ఉష్ణోగ్రత నమోదు కాగా, మానాల గ్రామంలో 45.2°C నమోదైంది. మండలవ్యాప్తంగా భానుడి ప్రతాపానికి మధ్యాహ్న వేళ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమైన వడగాలుల కారణంగా అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. తీవ్ర ఎండల కారణంగా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి చెరువులు, బోర్లు ఎండిపోతుండటంతో తాగునీటి సమస్య మరింత జటిలమవుతోంది.
వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్త!
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఎవరూ అవసరం లేకుండా బయట తిరగవద్దని అధికారులు సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ప్రజలు తరచూ నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్లరసాలు తీసుకోవాలని, ఎండలో పనిచేసే కూలీలు, రైతులు తప్పనిసరిగా తలకు గుడ్డలు కట్టుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

