ఏజెన్సీలో చిరుత సంచారం.. పాదముద్రలు గుర్తింపు
వెంకటాపురం – చర్ల సరిహద్దుల్లో అటవీ శాఖ తనిఖీలు
రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగొద్దని హెచ్చరిక
కాకతీయ, నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎదిర గుట్టలు, యాకన్నగూడెం, సుబ్బంపేట ప్రాంతాల సరిహద్దుల్లో చిరుత తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత పులి సమీప అటవీ ప్రాంతాల వైపు కదులుతున్నట్లు భావిస్తూ అటవీ విభాగం సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అడవి అంచు ప్రాంతాల్లో పశువులు, గొర్రెల మేపుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చిరుత కనిపిస్తే దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

