టాకీసులో కీసులాట!
ఏసీ వేయడం లేదని ప్రేక్షకుల ఆందోళన
ఉక్కపోతకు తట్టుకోలేక సినిమా హాల్లోనే అరుపులు.. కేకలు
జెమిని థియేటర్లో నిరసన.. యాజమాన్యం తీరుపై ఆందోళన
కాకతీయ, వరంగల్ : సినిమా థియేటర్లలో వందలాది రూపాయలు టికెట్ ధరల రూపంలో వసూలు చేస్తున్నా.. ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేయడంతో పాటు థియేటర్లలో సరైన వసతులు కల్పించకపోవడంపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అసౌకర్యాల మధ్య ప్రేక్షకుల ఆహ్లాదాన్ని అసంతృప్తిగా మారుస్తున్నాయి. వరంగల్ మహానగరంలోని జెమిని థియేటర్ లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. మ్యాట్నీ షో సినిమా చూడడానికి మధ్యాహ్నం భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లారు. సినిమా ప్రారంభమైనప్పటికీ హాల్ లో ఏసీ (ఎయిర్ కండీషనర్) ఆన్ చేయకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వేసవి ఎండల నేపథ్యంలో అంత పెద్ద హాలులో కేవలం ఫ్యాన్లు మాత్రమే వేయడంతో ఉక్కపోతకు తట్టుకోలేకపోయారు. వందల రూపాయలు వెచ్చించి వినోదం కోసం వస్తే కనీసం ఏసీ వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ లోపల పెద్ద ఎత్తున అరుపులతో నిరసన తెలిపారు. అయితే, ఆ సమయంలో థియేటర్ యజమాని అక్కడ లేకపోవడంతో.. లోపల ఉన్న సిబ్బంది ప్రేక్షకుల పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి థియేటర్లలో కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.

