జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
విద్యార్థులకు ఉదయం అల్పాహారం, రాగిజావ పథకం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో కీలక నిర్ణయాలు
పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, అర్హులైన వారందరికీ పథకాలను చేరవేసేలా అధికారులు పని చేయాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క జయ జయహే తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా, మండల స్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, సన్న వడ్లకు బోనస్, కళ్యాణ లక్ష్మి, వడ్డీ లేని రుణాలు వంటి పథకాల అమలు తీరును ఆమె సమీక్షించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, జిల్లాలో కొత్తగా 38 వేల పైచిలుకు పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు పౌష్టికాహారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. రోజు విడిచి రోజు రాగి జావ, వేడి పాలు అందించడంతో పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. స్థానిక నిరుద్యోగ యువత కోసం త్వరలో వందకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెబుతూ.. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ ద్వారా వందల సంఘాలకు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మే 25వ తేదీ నుంచి మహిళా వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రజల కన్నీళ్లు తుడవడమే లక్ష్యం
ప్రజా సమస్యలను, కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రామచంద్రపూర్ గ్రామ శివారులోని పది వేల ఎకరాల భూములకు రీ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధికి 22 ఎకరాల భూమిని సేకరించి నష్టపరిహారం చెల్లించామని, ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

