భక్తుల మనోభావాలతో రాజకీయాలా..?!
న్యూశాయంపేట హనుమాన్ విగ్రహం కూల్చివేతపై సమాధానం చెప్పాలి
గుడి భూమి దేవాలయానిదేనని చెబుతున్న రెవెన్యూ రికార్డులు
వినయ్ భాస్కర్‌పై చిల్లర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మాని విమర్శలతో కాలక్షేపం
భద్రకాళి మట్టి తరలింపు అవినీతిపై తక్షణమే విచారణ జరపాలి
ఆరు గ్యారెంటీలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
: ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : “వరంగల్ నగరంలో కాంగ్రెస్ నాయకులు భక్తుల మనోభావాలతో చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలి. న్యూశాయంపేటలో హిందూ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించిన హనుమాన్ విగ్రహాన్ని ఏ అధికారంతో కూల్చివేశారో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి” అని ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భేటీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, న్యూశాయంపేట ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భావోద్వేగాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సదరు వివాదాస్పద భూమి స్పష్టంగా భక్తాంజనేయ దేవాలయానిదేనని మర్రి యాదవ్ రెడ్డి ఆధారాలతో సహా పేర్కొన్నారు.
విగ్రహం కూల్చివేత వెనుక భారీ కుట్ర..
స్థానిక ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమిష్టిగా సహకారం కోరిన తర్వాతే న్యూశాయంపేటలో భక్తుల కోరిక మేరకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని, అలాంటప్పుడు ఆ విగ్రహాన్ని అర్ధాంతరంగా కూల్చివేయడం వెనుక అధికార పార్టీ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని యాదవ్ రెడ్డి ఆరోపించారు. నాలుగు సార్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. వినయ్ భాస్కర్ పరమ భక్తిపరుడని, గత పదేళ్లలో అన్ని మతాల ప్రార్థనా మందిరాల అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. స్థానిక భక్తుల విన్నపం మేరకే ఆయన గుడి వద్దకు వెళ్లారని, భక్తుల గొంతుకగా మారి అసలు విగ్రహాన్ని ఎందుకు కూల్చారనే పశ్చాత్తాప ప్రశ్నను మాత్రమే లేవనెత్తారన్నారు.
హైడ్రా ముసుగులో నీటికుంటల పూడ్చివేత!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నగరాల అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టి, కేవలం రాజకీయ విమర్శలతోనే కాలక్షేపం చేస్తోందని మర్రి యాదవ్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలో ‘హైడ్రా’ పేరుతో పెద్ద పెద్ద మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. న్యూశాయంపేట పరిధిలోని సహజ సిద్ధమైన నీటి కుంటలను ఎందుకు పూడుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వరంగల్ నగరంలో భద్రకాళి చెరువు బుండ్ ఆధునికీకరణ, నయీంనగర్ నాలా పనులు వంటి ఎన్నో చారిత్రాత్మక రక్షణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజాసేవపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పదేపదే వినయ్ భాస్కర్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకోబోవని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇదే సమయంలో భద్రకాళి చెరువులో జరిగిన మట్టి తరలింపు అక్రమాలపై, అందులోని అవినీతిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గుడికి శాశ్వత భవనం నిర్మించాలి: మాజీ కార్పొరేటర్లు
సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. న్యూశాయంపేట భక్తాంజనేయ ఆలయ పరిసరాల్లో స్థానిక హిందూ భక్తులంతా చందాలు వేసుకుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తే, దాన్ని కూల్చివేసి భక్తులపైనే అక్రమంగా కేసులు పెట్టడం, ఆ స్థలానికి కంచె వేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఈ గుడి కమిటీలో అన్ని పార్టీల వారూ సభ్యులుగా ఉన్నారని, గుడి స్థలం విషయమై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, హనుమాన్ గుడికి శాశ్వత భవనం నిర్మించేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. వినయ్ భాస్కర్ ఎల్లప్పుడూ ప్రజల మనిషి అని, ఆయనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయ్ భాస్కర్, సంకు నర్సింగరావు, జోరిక రమేష్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, ఉడతల సారంగపాణి, తాళ్లపెల్లి జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

