‘పెద్ది’కి పర్సంటేజీ సెగ!
సంతకం చేసి ఇస్తేనే థియేటర్లలోకి రానిస్తాం
నిర్మాతలు కావాలనే జాప్యం చేస్తున్నారు
హరిహర వీరమల్లు సమయం నుంచే మా డిమాండ్ ఇది
250 మంది ఎగ్జిబిటర్లది ఒకటే మాట.. ఒకటే బాట
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన తీర్మానం
కాకతీయ,హైదరాబాద్ : టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా వస్తున్న ‘పెద్ది’ చిత్ర ప్రదర్శనకు పర్సంటేజీ సెగ గట్టిగా తగిలింది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. “పెద్ది చిత్ర ప్రదర్శనకు నిర్మాతలు కచ్చితంగా పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఇస్తేనే మా థియేటర్లలో ఈ సినిమాను ఆడనిస్తాం” అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అత్యంత కీలకమైన సంచలన తీర్మానం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌కు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకటే మాటగా తమ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. నిర్మాతలు పర్సంటేజీ పద్ధతికి అంగీకరిస్తూ అధికారికంగా సంతకం చేసి ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తామని, లేనిపక్షంలో సినిమాను నిలిపివేస్తామని ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు.
వీరమల్లు సమయంలో వెనక్కి తగ్గాం.. ఇక కుదరదు!
గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలోనే తాము ఈ పర్సంటేజీ డిమాండ్‌ను గట్టిగా లేవనెత్తామని, అయితే ఆ సమయంలో తమ డిమాండ్ చెబితే సినిమాకు ఇబ్బంది అవుతుందని సర్దిచెప్పడంతో పరిశ్రమ హితం కోరి వెనక్కి తగ్గామని ఎగ్జిబిటర్లు గుర్తుచేశారు. ఆ తర్వాత నుంచి తమ డిమాండ్‌ను నిరంతరం వినిపిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. “నిర్మాతలు కావాలనే ఈ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతూ ఇక్కడి దాకా వచ్చింది. అయినా పోనీ, ఈ సినిమాను వదిలేద్దాం అనుకుంటే.. రాబోయే తదుపరి పెద్ద సినిమాకే ఆ పద్ధతి చేద్దాం అంటూ కాలయాపన చేస్తున్నారు. లేదా ఇంకా మూడు వారాల సమయం కావాలని కోరుతున్నారు. ఇలా వాయిదాలు వేయడం ఇక ఎంతమాత్రం కరెక్ట్ కాదు” అని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇందుకే ఇకపై వచ్చే ప్రతి పెద్ద సినిమాను పర్సంటేజ్ పద్ధతికే ఆడతామని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
‘పెద్ది’ పంచాయితీ తెగేనా..?
ఫిల్మ్ నగర్ వర్గాల్లో ‘పెద్ది’ సినిమాను ఈ పర్సంటేజీ ఇష్యూ నుంచి పక్కన పెట్టేశారని ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అసలు నిజం ఇప్పుడే బయటపడిందని ఎగ్జిబిటర్ల తీర్మానంతో స్పష్టమైంది. ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజీ కావాల్సిందేనంటూ తెలంగాణ ఎగ్జిబీటర్లు భీష్మించుకోవడంతో ఇప్పుడు ఈ పంచాయితీ ఎటు దారితీస్తుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే థియేటర్ల యజమానులకు ఎంత శాతం పర్సంటేజీ ఇవ్వాలనే అంశంపై సదరు చిత్ర నిర్మాతలే త్వరగా తేల్చుకోవాల్సి ఉందని, ఈ వివాదం త్వరగా ముగియకపోతే సినిమా విడుదలకు ఆటంకాలు తప్పవని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గట్టిగా హెచ్చరించింది.

