హసన్పర్తిలో భారీ అగ్నిప్రమాదం
స్కూళ్ల సమీపంలో చెలరేగిన మంటలు!
వ్యవసాయ పొలాల్లో వరి కొయ్యలను కాల్చడంతో రేగిన మంటలు
సకాలంలో స్పందించి మంటలను ఆర్పిన పోలీసులు
కాకతీయ, హనుమకొండ : హన్మకొండ జిల్లా హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థలైన ఇండియన్ స్కూల్, విహాన్ స్కూల్స్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే హసన్పర్తి ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. సకాలంలో స్పందించిన పోలీసులు, స్థానికులు మరియు ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలను చుట్టుముట్టి అదుపులోకి తీసుకురావడంతో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పినట్లయింది.
వరి కొయ్యలు కాల్చడం వల్లే..
పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో.. వ్యవసాయ పొలాల్లో కోతలు ముగిసిన తర్వాత మిగిలిపోయిన వరి కొయ్యలకు (పంట అవశేషాలు) కొందరు బాధ్యతారాహిత్యంగా మంటలు పెట్టడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తేలింది. వేసవి ఎండలు, ఈదురు గాలుల కారణంగా ఈ మంటలు వేగంగా పక్కనే ఉన్న పాఠశాలల వైపు వ్యాపించాయి. మంటలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో పోలీసులు సమీప ప్రాంత నివాసితులను ఇళ్లలో నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఈ ఘటనపై హసన్పర్తి ఇన్స్పెక్టర్ మహేందర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పొలాల వద్ద చెత్తాచెదారం, ఎండిన గడ్డి, వరి కొయ్యలను నిర్లక్ష్యంగా కాల్చవద్దని రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వరి కొయ్యలను కాల్చడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల వాయు కాలుష్యంతో పాటు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎక్కడైనా అగ్నిప్రమాదాలను గమనించిన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్ 100 లేదా హసన్పర్తి పోలీసుల అధికారిక నంబర్ 8712685015 కు సమాచారం అందించాలని కోరారు.

