ఏడుగురు యువకులపై కేసు నమోదు
పోలీసులపైనే దాడికి యత్నించిన ఫలితం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో పోలీసులపైనే దాడికి యత్నించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పస్రా ఎస్ఐ ఎస్‌కే తాజుద్దీన్ తీసుకున్న తక్షణ చర్యలను అభినందించారు. రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా మద్యం సేవిస్తూ ఘర్షణకు దిగిన యువకులు, శాంతింపజేయడానికి వచ్చిన ఎస్ఐ తాజుద్దీన్‌ను వెనక్కి తోసేసి దురుసుగా ప్రవర్తించారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన లెంకలపల్లి కుమారస్వామి, గంటా మల్లేష్, గంటా అంజన్ కుమార్, నాలా అశోక్, బద్దం పద్మ రెడ్డి, బద్దం పవన్, బద్దం సాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులపైనే చేయి చేసుకునే స్థాయికి వెళ్లిన ఆకతాయిలకు సకాలంలో స్పందించి పోలీసులు కేసు పెట్టడం చాలా మంచి పని అని, ఇలాంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి అని స్థానికులు పేర్కొన్నారు.

