వడదెబ్బతో టైలర్ మృతి
ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత
కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలో వడదెబ్బతో టైలర్ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన వెంకన్న (41) అనే టైలర్ కొద్ది రోజుల క్రితం తన అత్తగారి ఇంటికి వెళ్లిన సమయంలో తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బతో రైతు మృతి
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంమండలంలోని ఓడగూడెంకు చెందిన రైతు కర్ల నర్సయ్య వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ నెల 25వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు స్థానిక వరప్రసాద్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

వడదెబ్బతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఇసుక తోలకానికి వెళ్లివచ్చి నిద్రలోనే కన్నుమూత
కాకతీయ, నూగూరు వెంకటాపురం : తీవ్రమైన వడదెబ్బ కారణంగా ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండల పరిధిలోని సూరవీడు కాలనీ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ అధికారి కె. తిరుపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాటి నరేష్ (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 25న నరేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఇసుక తోలకానికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు (మే 26) ఉదయం 6 గంటల సమయంలో భార్య భవాని లేచి చూసేసరికి నరేష్ మంచంపై చేతులు గుంజుకుపోయి, అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆందోళన చెందిన భార్య వెంటనే మామ తాటి చిన్నికి సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్‌ను పిలిపించి చూపించగా, నరేష్ అప్పటికే మృతి చెందినట్లు ఆమె ధృవీకరించింది. తీవ్రమైన ఎండలో ఇసుక తోలకం చేయడం వల్లే వడదెబ్బ తగిలి నిద్రలోనే సొమ్మసిల్లి చనిపోయాడని మృతుడి తండ్రి తాటి చిన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


