మాట నిలబెట్టుకున్నా..
100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చా
కార్పొరేటర్లూ గల్లా ఎగరేసుకుని అభివృద్ధి పనులు చేపట్టండి
యూసీఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా
రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని అభివృద్ధి చేస్తా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : గత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపే యూసీఎఫ్ స్కీం ద్వారా రూ.840 కోట్ల భారీ నిధులు తీసుకొచ్చి నా మాట నిలబెట్టుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం రెండో అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిధుల విడుదల కోసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కట్టర్‌లకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాదనలు త్వరితగతిన పంపిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా కేవలం 17 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా అందులో కరీంనగర్ ఉండటం గర్వకారణమన్నారు. గతంలో నిధుల్లేక కార్పొరేటర్లు పడ్డ కష్టాలు తనకు తెలుసని, ఇప్పుడు పుష్కలంగా నిధులు వస్తున్నందున గల్లా ఎగరేసుకుని తమ తమ డివిజన్లలో పనులు ప్రారంభించాలని సూచించారు. శివారు ప్రాంతాల అభివృద్ధి, సిటీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. డంపింగ్ యార్డు కోసం రూ.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. తన ఏడేళ్ల ఎంపీ కాలంలో నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని వివరించారు. కేంద్ర పారామిలటరీ గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోళ్లలో రవాణా ఖర్చులతో సహా అన్ని పైసలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా యుద్ధప్రాతిపదికన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే తాము ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

