కాకతీయ ఎఫెక్ట్
కమలాపురంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ
కాకతీయ కథనంతో కదిలిన విద్యుత్‌శాఖ అధికారులు
నెల రోజుల సమస్య తీరడంతో రైతుల హర్షం

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామ పొలాల్లో విరిగిన విద్యుత్ స్తంభాల సమస్యపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ 23న సంభవించిన భారీ గాలివాన కారణంగా ఇక్కడి పొలాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నెలరోజులుగా వీటిని పునరుద్ధరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నెల 22న ‘నెల దాటినా వీడని చీకట్లు’ అనే శీర్షికతో కాకతీయ పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై తక్షణమే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించారు. గాలివానకు దెబ్బతిన్న పాత స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తెగిపోయిన వైర్లను సరిచేస్తూ విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నెలరోజులుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం లభించడంతో కమలాపురం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


