హెల్త్ స్కీమ్ అందరికీ వర్తింపజేయాలి : టీపీటీఎఫ్
కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండో తేదీలోపు ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్ మరియు రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకూ దీనిని వర్తింపజేయాలని టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల రిసోర్స్ కేంద్రం (ఎమ్మార్సీ) కార్యాలయం ముందు సంఘం 12వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ సభ్యురాలు కే. పద్మావతి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దీని నిర్వహణకు ప్రభుత్వం వెంటనే సరైన మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డీఏలను, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని (సీపీఎస్ రద్దు) పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ రాందాస్ మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలతో పాటు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి టీపీటీఎఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి, వెంకటేశం, లక్ష్మి, బిక్షపతి, శ్రీనివాస చారి, రమేష్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

