రైతులకు యూనియన్ బ్యాంక్ చేయూత
300 మందికి పవర్ స్ప్రేయర్ల పంపిణీ
కాకతీయ, నెల్లికుదురు : రైతుల అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 300 మంది రైతులకు ఫోర్ స్ట్రోక్ పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేసింది. శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జె. హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని అందజేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంత రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందిస్తున్న యూనియన్ బ్యాంక్ సేవలను అభినందించారు. వీటివల్ల సాగులో శ్రమభారం తగ్గి, సామర్థ్యం పెరుగుతుందన్నారు. అనంతరం బ్యాంక్ జనరల్ మేనేజర్ బైజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎస్‌ఆర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. స్ప్రేయర్ల వల్ల సాగు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో 9 శాఖల ద్వారా సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజినల్ హెడ్ జి. కమలాకర్, జిల్లా వ్యవసాయ అధికారి సరిత, సర్పంచ్ వెంకన్న, బిజెపి మండల అధ్యక్షుడు రాజు యాదవ్, బ్యాంక్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

