భగీరథ లీకేజీ.. ఇంట్రా ఏఈ గారెక్కడ..?
మూడు నెలలుగా వృథాగా పారుతున్న మంచినీరు
గిర్నీబావి ప్రధాన రహదారిపై పట్టించుకోని అధికారులు
బురదమయంగా రోడ్డు.. జారిపడుతున్న జనం
కాకతీయ, దుగ్గొండి : మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో మూడు నెలలుగా మంచినీరు వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గిర్నీబావి ప్రధాన రహదారిలోని వ్యాపార సముదాయాల సమీపంలో పైప్ పగిలిపోవడంతో ప్రతిరోజూ వేల లీటర్ల తాగునీరు రోడ్డుపాలవుతోంది. దీంతో రహదారి పూర్తిగా బురదమయంగా మారి దుకాణదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకుల కోసం వచ్చే ప్రజలు, వాహనదారులు ఇక్కడ జారిపడే ప్రమాదం ఉందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒకవైపు వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పవిత్రమైన భగీరథ నీరు ఇలా రోడ్లపాలు కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఇంట్రా ఏఈ వెంటనే స్పందించి, పైప్‌లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

