అగ్నివీర్‌గా ఎంపికైన గణేష్‌కు ఘన సన్మానం!
దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలి: సర్పంచ్ మాదరి ప్రశాంత్
శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో ఘనంగా సత్కారం
భారత సైన్యంలో చేరడంపై సర్వత్రా హర్షం
కాకతీయ, నెల్లికుదురు : భారత సైన్యంలో జవాన్‌గా పనిచేస్తూ దేశ రక్షణలో విశిష్ట సేవలందించాలని, తద్వారా భారత కీర్తి ప్రతిష్టలను మరింతగా పెంపొందించాలని శ్రీరామగిరి సర్పంచ్ మాదరి ప్రశాంత్ ఆకాంక్షించారు. నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన యువకుడు గణేష్ భారత సైన్యానికి ‘అగ్నివీర్’గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీరామగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గణేష్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. సర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ.. గణేష్ కృషి, పట్టుదల, అంకితభావం మరియు దేశసేవ పట్ల ఉన్న నిబద్ధత వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. భారత మాత సేవలో గణేష్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ శ్రీరామగిరి గ్రామానికి అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇలా దేశ రక్షణ కోసం యువకుడు సైన్యంలోకి వెళ్లడం అందరికీ గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ అభినందన కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, సొసైటీ డైరెక్టర్ బెల్లి నర్సయ్య, మద్దెల సమ్మయ్య, పోరండ్ల సోమయ్య, పోతారాజు యాదగిరి, నర్సింగ వెంకన్న, పోతారాజు వెంకన్న, బిరెల్లి శివకుమార్ మరియు శ్రీరామగిరి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

