కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
బీజేపీలో చేరిన పలువురు సీనియర్ నాయకులు
కాకతీయ, నల్లబెల్లి : రాష్ట్రంలోనే కాకుండా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయ శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లబెల్లి మండలంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ అధ్యక్షతన, ముచ్చింపుల గ్రామ పార్టీ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండల సీనియర్ నాయకుడు కక్కెర్ల సురేష్తో పాటు కొత్తపెల్లి మధుకర్, శీలం ప్రవీణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నడిగొట్టు ధర్మేందర్ తదితరులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వీడి బీజేపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి రాణా ప్రతాప్ రెడ్డి కాషాయ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అమలు కాని హామీలు
ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అడ్డగోలుగా మోసపూరిత హామీలు ఇచ్చి తీవ్రంగా వంచించాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయాయని విమర్శించారు. నియోజకవర్గంలో బీజేపీ అందిస్తున్న పటిష్టమైన నాయకత్వం, ప్రజా పోరాటాలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరి నచ్చక ఆయా పార్టీల సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

