ఉద్యమకారులకు సమాజం అండగా నిలవాలి
రాజకీయాలకు అతీతంగా నిజమైన పోరాట యోధులను గుర్తించాలి
ఇచ్చిన హామీని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి
ఐకాస కన్వీనర్ గోధుమల కుమారస్వామి
హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ సంఘీభావ ర్యాలీ
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన ఉద్యమకారులకు తెలంగాణ సమాజం అండగా నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్క్ టానూ నాయక్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం, అంబేద్కర్ చౌరస్తా వరకు ఆదివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కుమారస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. మలిదశ ఉద్యమం వల్ల రాష్ట్రంలోని రాజకీయ పార్టీల బడా నాయకులు, అధికారులు, పెద్ద వ్యాపారస్థులు బాగుపడ్డారు తప్ప.. విలువైన ప్రాణాలు, సమయాన్ని కోల్పోయి పోరాడిన నిఖార్సైన ఉద్యమకారులు మాత్రం కనీస గుర్తింపునకు నోచుకోక అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీ ఇచ్చి రెండున్నరేళ్లు దాటింది..
గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులకు తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని, ప్రతి ఒక్కరికీ 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిందని కుమారస్వామి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచిన తర్వాతనైనా గుర్తింపు కోసం కమిటీని వేయడం అభినందనీయమన్నారు. అయితే ఇకనైనా తాత్సార్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యమకారులు తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
రాజకీయ నాయకులతో కమిటీ వద్దు
ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ సాధం రాజన్న మాట్లాడుతూ.. తెలంగాణ కోసం నాడు వీధిన పడి కొట్లాడిన ఉద్యమకారులు, నేడు తమ హక్కుల కోసం మళ్లీ పోరాడాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. కమిటీ కాలయాపన చేయకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించి తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలలో వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ.. కమిటీ విధివిధానాలను వెంటనే ప్రకటించాలన్నారు. సీనియర్ ఉద్యమకారులు లేకుండా కేవలం రాజకీయ నాయకులతోనే కమిటీలు వేస్తే.. అది పార్టీల మధ్య గొడవలకు దారి తీస్తుంది తప్ప ఉద్యమకారులకు న్యాయం జరగదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక కమిటీ వేసి, ఆయా రంగాల్లో ఉద్యమించిన వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తే గౌరవంగా ఉంటుందని సూచించారు. ఈ భారీ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు జైసింగ్ రాథోడ్, భట్టు రాజేందర్, నవరత్న ఆనంద్, సయ్యద్ గౌస్, చాపర్తి కుమార్ గాడ్గే, జన్ను పద్మ, ఎదునూరి రాజమౌళి, కూకట్ల విజయ్, జల్లెల కృష్ణమూర్తి, కొడపాక దేవి, డోలక్ యాదగిరి, రామగిరి బిక్షపతి, సమ్మయ్య రాథోడ్, రజనీ కాంత్, సురాసి విక్రమ్, తాడిశెట్టి క్రాంతి కుమార్, శోభ, జుబేర్, నయీం, ఠాకూర్ మోతీ సింగ్, దొమ్మాటి రవీందర్, అయిషా నస్రీన్, షేక్ అక్రమ్, మంద వీరస్వామి, పొడేటి ప్రశాంత్, చిలువేరు రామచంద్రం, సుధమల్ల అశోక్, గురిమిల్ల రాజు, రుద్రోజు నవీన్, ముకుందాచారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

