విధిలో ప్రతిభకు గుర్తింపు
పతకాలు అందుకున్న పోలీసులకు సీపీ అభినందనలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలు అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అధికారులు మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, సేవా పతకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావంతో పనిచేసే పోలీసులకు ప్రభుత్వ పతకాలు లభిస్తాయన్నారు. ఈ గుర్తింపుతో మరింత బాధ్యతగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పతకాలు అందుకున్న వారిలో టాస్క్‌ఫోర్స్ సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) మధుసూదన్ మహోన్నత సేవా పతకం పొందగా, క్రైమ్ ఏసీపీ సదయ్య, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్‌ఐ) వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. అలాగే ఎస్‌ఐ కనకచంద్రం, సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్‌ఐలు) జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, స్వర్ణలత సేవా పతకాలు సాధించారు.

