అభివృద్ధిని విచ్ఛిన్నం చేస్తున్న కాంగ్రెస్
తెలంగాణ అస్తిత్వానికే ముప్పు తెస్తున్నారు
దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ దశాబ్ద కాల పాలన
: మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
అమరవీరుల త్యాగాలకు గులాబీ శ్రేణుల ఘన నివాళి
కాకతీయ, నల్లబెల్లి : అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తోందని మాజీ జిల్లా పరిషత్ పక్ష నేత పెద్ది స్వప్న మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లబెల్లిలోని భారత రాష్ట్ర సమితి మండల పార్టీ కార్యాలయంలో మంగళవారం జాతీయ పతాకంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ది స్వప్నతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వారు ఘన నివాళులర్పించారు.
వందేళ్ల అభివృద్ధికి కేసీఆర్ పునాది
అనంతరం జరిగిన సమావేశంలో పెద్ది స్వప్న మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, రాబోయే వందేళ్ల రాష్ట్ర ప్రగతికి గట్టి పునాదులు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వయంపాలన అస్తిత్వానికే ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

