నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలి
సెట్బ్యాక్లు, పార్కింగ్ సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి
అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టాలి
దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాతే నిర్ణయం
ప్రజల భద్రత ప్రణాళికాబద్ధ అభివృద్ధి దృష్ట్యా తనిఖీలు
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్
భవన సముదాయాల క్షేత్రస్థాయి పరిశీలన
కాకతీయ, వరంగల్ : నగర పరిధిలో నిర్మించిన భవనాలకు సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరులో నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ తెలిపారు. బుధవారం కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన పలు భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన యజమానులు సమర్పించిన పత్రాలను పరిశీలించడంతో పాటు నిర్మాణాలకు సంబంధించిన కొలతలు, సెట్బ్యాక్లు, పార్కింగ్ సౌకర్యాలు మరియు ఇతర సాంకేతిక ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు.
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు
ప్రభుత్వ నిబంధనలు, భవన నిర్మాణ అనుమతి షరతులు మరియు సాంకేతిక ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించిన భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయబడతాయని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. ప్రజల భద్రత, నగర ప్రణాళికాబద్ధ అభివృద్ధి దృష్ట్యా ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భవన యజమానులు నిర్మాణాల సమయంలో అనుమతులకు అనుగుణంగా పనులు చేపట్టి నగరాభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

