గ్రామ సభల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఇనుగుర్తి మండలంలో ముగిసిన గ్రామసభలు
శాఖల సమన్వయంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపు
ఎంపీడీవో బండారు పార్థసారథి గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు బుధవారంతో ముగిశాయి. కోమటిపల్లి, పాత తండా, తారాసింగ్ తండాలలో జరిగిన గ్రామసభల్లో ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి అంశాలపై అధికారులు చర్చించారు. సర్పంచులు మద్దెల బిక్షపతి గౌడ్, ఇస్లావత్ నరేష్, నూనావాతు బద్రు అధ్యక్షతన జరిగిన సభలకు ఎంపీడీవో బండారు పార్థసారధి గౌడ్, ఎస్సై కరుణాకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చెత్త నిర్వహణలో భాగంగా పచ్చ, నీలం, ఎరుపు, నలుపు డస్ట్‌బిన్‌ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యం, విద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, మైనారిటీ, స్వయం సహాయక సంఘాలు, మిషన్ భగీరథ, వ్యవసాయం, ఇరిగేషన్, అటవీ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను శాఖల సమన్వయంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సై కరుణాకర్ మాట్లాడుతూ గంజాయి వినియోగం, విక్రయాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామసభల్లో ఉపసర్పంచులు ఇస్లావత్ బాబు, నరేష్, ఆర్‌ఐ ఎండి మున్వర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దుర్గ, పంచాయతీ కార్యదర్శి రమణమూర్తి, ఏఈఓలు భాస్కర్, చందులాల్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

