మేడారం పనులు పూర్తి చేయాలి
భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి
శాశ్వత నిర్వహణ వ్యవస్థకు ప్రాధాన్యం
గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి, మేడారం మహాజాతర కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం, జంపన్నవాగు పరిసరాలు, ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకల మార్గాల్లో పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వనదేవతల ప్రాంగణ నిర్వహణ కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.
గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున శాశ్వత స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను దశల వారీగా ఏర్పాటు చేయాలని తెలిపారు. జంపన్నవాగు ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మేడారం పరిసరాల్లో శాశ్వత మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. వరదల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలు, కుంటలు, చెరువులు, కరకట్టల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌తో కలిసి సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, డీఎఫ్‌వో వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా అధికారులు, పూజారులు పాల్గొన్నారు.

