ఏకాంత జంటను బెదిరించి దోపిడీ
ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్
ముగ్గురు నిందితుల అరెస్ట్.. నగలు, బైక్ స్వాధీనం
మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రే స్వామి
కాకతీయ, వరంగల్ సిటీ : నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ యువతీ యువకులను ఫోటోలు, వీడియోల పేరుతో బెదిరించి బంగారు, వెండి ఉంగరాలు దోచుకున్న ముగ్గురు నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక బంగారు ఉంగరం, ఒక వెండి ఉంగరం, మూడు సెల్ఫోన్లు, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బౌరి పవన్ సింగ్, బౌరి రవీందర్ సింగ్, బౌరి సికెందర్ సింగ్ మద్యం కోసం డబ్బులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఉర్సుగుట్ట-బట్టుపల్లి రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఓ యువతీ యువకులు సమీపంలోని వెంచర్లోకి వెళ్లడాన్ని గమనించిన నిందితులు అక్కడికి చేరుకుని వారిని చుట్టుముట్టారు.
బెదిరింపులతో నగల దోపిడీ
సెల్ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి వాటిని కుటుంబ సభ్యులకు పంపుతామని, మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుల వద్ద నగదు లేదని చెప్పడంతో యువకుడిపై దాడి చేశారు. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుతానని బాధితుడు చెప్పినా నిందితులు అంగీకరించలేదు. అనంతరం యువతి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని, యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇదే సమయంలో సికెందర్ సింగ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దోచుకున్న ఉంగరాలను విక్రయించేందుకు వరంగల్‌కు వస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై శ్రావణ్, పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుంది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రే స్వామి తెలిపారు. భౌరి పవన్ సింగ్‌పై గతంలో కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దోపిడీ కేసు, భౌరి రవీందర్ సింగ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు దోపిడీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

