పుష్పగుచ్ఛాలతో విద్యార్థులకు స్వాగతం
ఏటూరునాగారం జడ్పీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సందడి
ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ పెంచేలా కార్యక్రమం
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా సోమవారం ఆ పాఠశాలలోనే చదువుకున్న పూర్వ విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలకు వస్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఆప్యాయంగా పలకరిస్తూ, చేతికి పుష్పాలను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 91-92 ఎస్ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థి సాయిని మహేశ్ మాట్లాడుతూ, “తాము చదువుకున్న ఈ పాఠశాల ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి, ఉన్నత స్థానాల్లో నిలబెట్టిందని, ఇటీవల ఒక విద్యార్థిని జిల్లా ర్యాంకు సాధించడం ఈ పాఠశాల ఘనతకు నిదర్శనం” అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆసక్తిని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. పాఠశాల హెడ్మాస్టర్ సాంబశివరావు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు పాఠశాలను గుర్తుంచుకుని, ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాయిని మహేష్, సింధు, బొడ సారయ్య, గంజి రమేష్, చిదరాల హేమ సుందర్, మోడెం చందు, చెన్న తిరుపతిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఈ వినూత్న ప్రయత్నం పాఠశాల విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

