విలాసాగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు
150 ట్రాక్టర్ల ఇసుక డంప్‌లు సీజ్
జమ్మికుంట మండలంలో పోలీసుల మెరుపు దాడి
మూడు భారీ అక్రమ ఇసుక డంప్‌లు స్వాధీనం.. రెండు ట్రాక్టర్లు సీజ్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ బృందాలు సోమవారం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో భారీ మొత్తంలో అక్రమ ఇసుక నిల్వలు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు భారీ ఇసుక డంప్‌లను పోలీసులు గుర్తించారు. ఒక డంప్‌లో సుమారు 100 ట్రాక్టర్ లోడ్లు, మిగిలిన రెండు డంప్‌లలో 50 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను గుర్తించి సీజ్ చేశారు. అలాగే, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 150 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జమ్మికుంట పోలీసులకు అప్పగించారు.

నిరంతర నిఘా కొనసాగుతుంది: సీపీ గౌష్ ఆలం
జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తూ ఇసుకను అక్రమంగా తరలించే వారిపై మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వాహనాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, జిల్లాలో ఇసుక మాఫియా కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని సీపీ తెలిపారు.

