రూ.30 వేల ఐస్‌క్రీం నిల్వలు స్వాధీనం
ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై అధికారుల చర్యలు
మామునూరులో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి
ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించిన స్వాధీనపరుచుకున్న నిల్వలు
రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు
కాకతీయ, హనుమకొండ: వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యసాయినగర్‌లో ఐస్‌క్రీం వ్యాపారం ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక వ్యాపార కేంద్రంపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 30,690 విలువైన ఐస్‌క్రీం నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మామునూరు సత్యసాయినగర్‌లోని ఒక అద్దె ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ రాజస్థాన్ రాష్ట్రం, భిల్వారా జిల్లాకు చెందిన కన్హయ్యా లాల్ జాట్, నివాస గృహంలోనే ఐస్‌క్రీం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో రబ్డీ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, బాదం కుల్ఫీలతో పాటు వివిధ రకాల ఫ్లేవర్లు కలిగిన ఐస్‌క్రీంలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
చట్టపరమైన చర్యల దిశగా..
వ్యాపారి సమర్పించిన రసీదుల ఆధారంగా స్టాక్‌ను పరిశీలించిన అధికారులు, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించారు. తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల కోసం కేసును ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్‌ఐ టీ. వీరస్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాల్లో ఆహార పదార్థాల వ్యాపారం చేయడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

