బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్
దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా పుష్ప’ జహంగీర్ ఖాన్
తృణమూల్ నేతను తాడుతో కట్టి వీధుల్లో ఊరేగిస్తూ స్టేషన్‌కు
హైకోర్టు సీరియస్.. పోలీసుల నుంచి నివేదిక కోరిన న్యాయస్థానం
కోల్‌కతా : అంకుశం సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్, విలన్‌ను నడిరోడ్డుపై లాక్కెళ్లే సీన్ చూసి ఉంటారు. సరిగ్గా అదే తరహా దృశ్యం పశ్చిమ బెంగాల్ వీధుల్లో చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ వివాదాస్పద నేత, ‘ఫాల్తా పుష్ప’గా పేరుగాంచిన జహంగీర్ ఖాన్‌ను పోలీసులు నడిరోడ్డుపై తాడుతో కట్టి ఊరేగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా పేరున్న జహంగీర్ ఖాన్, అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దోపిడీలు, భూకబ్జాలు, ఎన్నికల అనంతర హింస వంటి తీవ్రమైన ఆరోపణలపై జూన్ 8న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించగా, దర్యాప్తులో భాగంగా ‘క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్’ పేరుతో పోలీసులు అతడిని ఫాల్తా, సహరార్హత్ ప్రాంతాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జహంగీర్ ఖాన్ నడుముకు తాడు కట్టి, అతడిని వీధుల్లో నడిపించారు. చెప్పులు లేకుండా, షార్ట్ టీ-షర్టుతో ఉన్న ఖాన్, తన తప్పులను ఒప్పుకుంటూ చెవులు పట్టుకుని ప్రజలకు క్షమాపణలు చెబుతూ నడవాల్సి వచ్చింది. భారీ భద్రత మధ్య పోలీసులు అతడిని ఇలా తిప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక నిందితుడిని బహిరంగంగా ఈ విధంగా అవమానించడంపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
ఎవరీ జహంగీర్ ఖాన్?
ఫాల్తా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జహంగీర్ ఖాన్, రీ-పోలింగ్‌కు రెండు రోజుల ముందు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దేశం విడిచి పారిపోయేందుకు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని పానిటాంకి ప్రాంతానికి చేరుకోగా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఫాల్తా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరస్తుల పట్ల కఠినంగా ఉండటం ఒక ఎత్తయితే, చట్టం చేతిలోకి తీసుకుని ఇలా నడిరోడ్డుపై అవమానించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని కొందరు వాదిస్తుంటే, ఇతని అరాచకాలు భరించలేకపోయిన స్థానికులు మాత్రం పోలీసుల చర్యను సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా, బెంగాల్ రాజకీయాల్లో జహంగీర్ ఖాన్ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చగా మారింది.

