నిషేధిత కలుపు మందుల స్వాధీనం
విక్రయాల శాలపై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు
దుకాణ యజమాని అరెస్ట్, రూ. 57,665 విలువైన మందుల స్వాధీనం
కాకతీయ, హనుమకొండ: నిషేధిత కలుపు మందులను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం మెరుపు దాడి చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని ‘శ్రీ రామ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్’ దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసేట్, పారాక్వాట్ హెర్బిసైడ్లను విక్రయాల కోసం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో దుకాణ యజమాని కుక్కల ప్రభాకర్ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 45 లీటర్ల గ్లైడాన్, 75 ప్యాకెట్ల గ్లైడాన్, 9 లీటర్ల మిల్‌క్యాట్, 16 బాటిళ్ల మిల్‌క్యాట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 57,665 ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, స్వాధీనం చేసుకున్న సరుకుతో సహా తదుపరి చర్యల కోసం కమలాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి. బాబులాల్, ఎస్సై కె. సుధాకర్ మరియు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

