విపత్తుల నివారణకు సన్నద్ధంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాలు, శిథిల భవనాలపై ప్రత్యేక దృష్టి
సీజనల్ వ్యాధులు, విద్యుత్ ప్రమాదాల నివారణకు ఆదేశాలు
వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాబోయే వర్షాకాలంలో వరదలు, సహజ విపత్తుల నివారణకు అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత ఏడాది లోతట్టు ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గృహాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సాంబశివరావును ఆదేశించారు.
గ్రామాల్లో ఘన వ్యర్థాల సేకరణకు ఒక చిన్న గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి, నాలుగు రకాల చెత్త వేరుచేసే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రికల్ శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఎస్ఈ ఆనందంకు సూచించారు. అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు.

