డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక సాధికారత
రుణ చెల్లింపుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
స్త్రీ నిధి సమాఖ్యలకు ఉచితంగా పీఓఎస్ యంత్రాల పంపిణీ
డిజిటలైజేషన్ వైపు స్వయం సహాయక సంఘాల అడుగులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : డిజిటలైజేషన్ను ప్రోత్సహించేందుకు స్త్రీ నిధి సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలు పీఓఎస్ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని బల్దియా ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సమాఖ్యల ప్రతినిధులకు పీఓఎస్ యంత్రాలను కలెక్టర్ అందజేశారు. స్త్రీ నిధి ఆధ్వర్యంలో ఉచితంగా అందించే ఈ యంత్రాల ద్వారా సభ్యులు బ్యాంకులకు వెళ్లకుండానే రుణ చెల్లింపులు చేసుకోవచ్చని, వెంటనే రసీదు కూడా పొందవచ్చని ఆమె తెలిపారు. దీనివల్ల చెల్లింపులు సులభతరంగా, పారదర్శకంగా జరుగుతాయని, ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వివరించారు. ప్రస్తుతం హన్మకొండ పరిధిలో 56, వరంగల్ పరిధిలో 45 పీఓఎస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో అన్ని సమాఖ్యలకు ఈ సదుపాయం విస్తరిస్తామని చెప్పారు. పీఓఎస్ వినియోగంపై సభ్యులు సాంకేతిక అవగాహన పెంచుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయిలో అవార్డుకు అవకాశం
బ్యాంక్ లింకేజీలు, రుణ వసూళ్లు, ఎన్పీఏ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ విషయంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు చొరవ చూపాలని కలెక్టర్ అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్త్రీ నిధి రుణాల అమలులో వరంగల్ నగరం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, జాతీయ స్థాయిలోనూ అవార్డు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాల ప్రయోజనాలను రెగ్యులర్ స్వయం సహాయక సంఘాలకే పరిమితం చేయకుండా, అర్హులైన ఇతర గ్రూపులకు కూడా విస్తరించి మరిన్ని మహిళలను ఆర్థిక సాధికారత దిశగా నడిపించాలని ఆమె సూచించారు. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ సైదిరెడ్డి, మేనేజర్ కపిల్, టీఎంసీ రమేష్, అసిస్టెంట్ మేనేజర్లు వెంకట్, సుప్రియ, సతీష్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రవీణ్, రజిత, శ్రీలత, సుజాత తదితరులు పాల్గొన్నారు.

