నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి
చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ శాఖ చర్యలు
రైతు వేదికల ద్వారా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
వచ్చే విద్యా సంవత్సరంలోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి
మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్
వానాకాలం సాగు, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధుల దిశానిర్దేశం
కాకతీయ, మహబూబాబాద్ : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి
రామచంద్రునాయక్ మాట్లాడుతూ చెరువులు, కాలువలు, మిషన్ కాకతీయ పనుల పురోగతిని సమీక్షించారు. చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు సక్రమంగా అందేలా ఇరిగేషన్ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు వాతావరణ సమాచారం, సాగు సలహాలను ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ ద్వారా పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మండల స్థాయి రైతు వేదికల ద్వారా పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించి, అధిక లాభాలు వచ్చే పంటల వైపు వారిని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై ప్రభుత్వ విప్ ఆరా తీశారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టళ్లు, ల్యాబ్‌లు, భవన నిర్మాణ పనులను రాబోయే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడానికి డాక్టర్ల హాజరు, మందుల స్టాక్, 24/7 ఫార్మసీల అందుబాటుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు భూక్య మురళీ నాయక్, కోరం కనకయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికీ మర్యాదపూర్వకంగా, వేగంగా వైద్యం అందాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి జాప్యం సహించమని, ప్రతి బుధవారం జరిగే మండల స్థాయి సమావేశాల్లో పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు ఖచ్చితంగా పాల్గొని పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

