దేవాదుల కెనాల్ నిర్మాణం పూర్తి చేయాలి
తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి
రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-5, ఎల్ఎంసీ డీసీ-3 కెనాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. శనివారం సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఈర్లపైడి మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా కెనాల్ నిర్మాణం పూర్తి కాలేదని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, పంటలు ఎండిపోకుండా తాత్కాలికంగా కెనాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. నల్లబెల్లి మండలం గొల్లపల్లె నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకలపల్లి, ఆకుల తండా, ఎనగల్ తండా, ముత్తూజిపేట, రాజుపేట చెరువుల్లోకి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీజన్‌కు ముందే పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్రె మొగిలి, నూకల మరి సదానందం, బోనగిరి సారన్న, బుసాని నరసింహస్వామి, లింగదారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

