అభివృద్ధి పేరుతో అరాచకం
కాంగ్రెస్ నేతల దాడులతో తండాల్లో భయాందోళన
నర్సంపేటలో రౌడీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు
కాంగ్రెస్ ఏజెంట్‌గా పోలీస్ వ్యవస్థ
గిరిజనులపై దాడులను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నర్సంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులు అమానుషమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అనుచర వర్గంతో కలిసి గిరిజన తండాల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. “అభివృద్ధిని ప్రశాంత వాతావరణంలో చేపట్టాలి తప్ప, దాడులు చేస్తూ గిరిజనులను భయపెట్టడం సరికాదు,” అని ఆయన హితవు పలికారు. నియోజకవర్గంలో గిరిజనులపై జరుగుతున్న దాడులు పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని, దీనివల్ల గిరిజనులకు, సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో, నేడు రౌడీ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, తక్షణమే అధికారులు స్పందించి అరాచకాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

