‘కాకతీయ’ కథనానికి స్పందన
ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభానికి రంగం సిద్ధం
పాఠశాలను పరిశీలించిన ఎంఈవో, హెచ్ఎం
పూర్వ విద్యార్థుల శ్రమదానానికి అధికారుల ప్రశంసలు
కాకతీయ, మలహర్ : ‘కాకతీయ’ పత్రికలో ఇటీవల ప్రచురితమైన “మూతపడిన వెల్మలపల్లి ప్రభుత్వ పాఠశాల” కథనానికి సానుకూల స్పందన లభించింది. ఈ వార్తపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) లక్ష్మణ్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ తిరుపతితో కలిసి పాఠశాలను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడిన ఈ పాఠశాల ప్రాంగణం, గత కొన్నేళ్లుగా పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థకు చేరుకుంది. అయితే, తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. శ్రమదానం చేసి పాఠశాల ఆవరణను శుభ్రపరచడమే కాకుండా, తిరిగి ప్రారంభించేలా పాఠశాలను సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. వీరికి గ్రామ ప్రజలు, విద్యాభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
త్వరలోనే తరగతుల నిర్వహణ: ఎంఈవో
పాఠశాలను పరిశీలించిన ఎంఈవో లక్ష్మణ్ మాట్లాడుతూ, “విద్యాలయం సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం వంటిది. పూర్వ విద్యార్థుల నిస్వార్థ సేవ అభినందనీయం. పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి, అన్ని అనుమతులు పొంది త్వరలోనే తరగతులు నిర్వహించేలా కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల స్థానికులు, పూర్వ విద్యార్థులు చూపుతున్న ఈ చొరవ మండలంలోనే ఆదర్శంగా నిలిచిందని అధికారుల బృందం కొనియాడింది.

