- బాధిత కుటుంబానికి భరోసానిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
- మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి కుటుంబానికి పరామర్శ
కాకతీయ, రాయపర్తి: ప్రజా ప్రతినిధి అంటే కేవలం ఓట్ల కోసమే కాకుండా, తనపై నమ్మకం ఉంచిన వారి కష్టసుఖాల్లో తోడుంటారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి ధర్మపత్ని పుష్పలీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం ఉదయం నేరుగా మురళి ఇంటికి చేరుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుష్పలీల భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరణానికి గల కారణాలను, ఆమె ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడి ఇంట్లో జరిగిన ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “నిరంతరం ప్రజల కోసం శ్రమించే మురళికి ఈ కష్ట సమయంలో మానసిక ధైర్యం ఎంతో అవసరం. ఆ కుటుంబానికి పార్టీపరంగా, వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను, మీరు ఏమాత్రం అధైర్యపడకండి” అంటూ భరోసానిచ్చారు. ఎమ్మెల్యే చూపిన ఈ మానవీయత పట్ల స్థానికులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, సర్పంచ్ కనుకుంట్ల మంజుల అశోక్, హమ్యా నాయక్, కాశీనాథం, పెండ్లి మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

