ప్రజా సమస్యలపై పోరాడండి
రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మనమే
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు
మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం
కాకతీయ, నెల్లికుదురు: ప్రజా సమస్యలపై గళమెత్తుతూ నిరంతరం ప్రజలతో మమేకమైతేనే రాష్ట్రంలో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమరు కొమ్ముల గౌతమ్ రావు అన్నారు. మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు జిల్లాలోని 16 మండలాల పార్టీ అధ్యక్షులతో పార్టీ అభివృద్ధిపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ, అవి అర్హులకు అందేలా చూడాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
కుట్రతో పథకాలను అడ్డుకుంటున్నారు
మోడీ పథకాలపై గౌతమ్ రావు మాట్లాడుతూ, పంట నష్టానికి ఫసల్ బీమా, ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రజారోగ్యానికి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేస్తే మోడీకి పేరు వస్తుందనే భయంతో గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి కలిగిన ఆ రెండు పార్టీలు త్వరలోనే అంతరిస్తాయని పేర్కొన్నారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో పార్టీ జయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ, గిరిజన యూనివర్సిటీతో పాటు మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి రూ. 531 కోట్లు మంజూరు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సింగారం సతీష్, వద్దిరాజు రామచంద్రరావు, పొదిల నరసింహారెడ్డి, చిలుపూరి వెంకన్న, గడ్డం అశోక్, నల్లాని పాపారావు, లింగాల సుధీర్ రెడ్డి, ఇందు భారతి, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

