స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్
సర్టిఫికెట్ల కోసం విద్యార్థులపై కళాశాలల ఒత్తిడి
బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, నర్సింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లే క్రమంలో అవసరమైన టీసీలు, మెమోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలను సంప్రదిస్తే, ప్రభుత్వం నుండి ఫీజు బకాయిలు రాకపోవడంతో యాజమాన్యాలు ముందుగా విద్యార్థులను ఫీజులు చెల్లించాలని కోరుతున్నాయని భూక్య జంపన్న తెలిపారు. ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులను బలిచేయడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించిన భూక్య జంపన్న, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆటంకం లేకుండా సర్టిఫికెట్లు అందేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని భూక్య జంపన్న హెచ్చరించారు.

