పాఠ్యాంశంగా పీఎంజే దోపిడీ ఛేదన కేసు
సుబోధ్ సింగ్ ముఠాపై గ్రూప్-1 ట్రైనీ అధికారులకు శిక్షణ
సీపీ గౌష్ ఆలం నేతృత్వంలోని దర్యాప్తునకు రాష్ట్రస్థాయి గుర్తింపు
సాంకేతికత, సమన్వయంతో క్లిష్ట కేసును ఛేదించిన తీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్
రాష్ట్ర పోలీసింగ్‌కు ఆదర్శంగా కరీంనగర్ పోలీసుల వ్యూహం
కాకతీయ, కరీంనగర్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడి పోలీసులకు సవాల్‌గా మారిన బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ ముఠాను కరీంనగర్ పోలీసులు ఛేదించిన తీరు ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీలో పాఠ్యాంశంగా మారింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం నేతృత్వంలో సాగిన ఈ దర్యాప్తు రాష్ట్ర పోలీసింగ్‌లో ఒక ఆదర్శ కేస్ స్టడీగా గుర్తింపు పొందింది. ఈ కేసు దర్యాప్తులో అనుసరించిన వ్యూహాలు, సాంకేతిక ఆధారాల వినియోగం, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి అంశాలను గ్రూప్-1 ట్రైనీ అధికారులకు వివరించనున్నారు. పీఎంజే నగల దుకాణంలో దోపిడీ జరిగిన వెంటనే సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ, వందలాది సీసీ కెమెరాల దృశ్యాలు, మొబైల్ టవర్ డేటా, ప్రయాణ మార్గాలు, నిందితుల కదలికలను నిశితంగా పరిశీలించారు. తొలుత ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోయినా, దర్యాప్తును ఆపకుండా సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందుకు సాగి కీలక ఆధారాలను సేకరించారు.

అంతర్రాష్ట్ర సమన్వయమే విజయ రహస్యం
ఈ కేసు దర్యాప్తులో గౌష్ ఆలం స్వయంగా బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల ఐపీఎస్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించారు. సుబోధ్ సింగ్ ముఠా నెట్‌వర్క్‌పై సమాచారాన్ని సేకరించి, రాబరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, వారి వెనుక ఉన్న గ్యాంగ్‌ను కూడా గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల పోలీసులు ఛేదించలేకపోయిన నెట్‌వర్క్‌ను కరీంనగర్ పోలీసులు వెలికితీయడం ఈ కేసులో ప్రత్యేకతగా నిలిచింది. ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్‌ను విచారించేందుకు ఆరు కోర్టుల నుంచి అనుమతులు పొందడం దర్యాప్తులో కీలక ఘట్టమైంది. ఈ విజయవంతమైన దర్యాప్తు వెనుక ఉన్న వ్యూహాలను తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 ట్రైనీ అధికారులకు సీపీ గౌష్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఆయనతో పాటు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులు కూడా పాల్గొని, కేసు ఎలా ఛేదించారు, నిందితులను ఎలా గుర్తించారు, సాంకేతిక ఆధారాలను ఎలా వినియోగించారు, అంతర్రాష్ట్ర పోలీసులతో ఎలా సమన్వయం సాధించారు అనే అంశాలను సుమారు రెండు గంటల పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. క్లిష్టమైన నేరాలను శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయంతో ఎలా ఛేదించవచ్చో చూపించిన ఈ కేసు, రాష్ట్ర పోలీసింగ్‌కు ఆదర్శంగా నిలిచిందని అధికారులు పేర్కొంటున్నారు.

