రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపైనే దాడి
ప్రతిపక్ష నేతల అరెస్టు కేంద్ర నిరంకుశ పాలనకు నిదర్శనం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, పరకాల : ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మంగళవారం నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే రేవూరి పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ..రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని విమర్శించారు.ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొంటూ, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్, కౌన్సిలర్లు,కాంగ్రెస్ యూత్ నాయకులు మేకల అనిల్ శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

