డ్రగ్స్‌కు దూరంతో ఉజ్వల భవిష్యత్
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి
: మంత్రి కొండా సురేఖ
టీఎస్‌జేయూ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక 2కే రన్
హాజరైన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
కాకతీయ, హనుమకొండ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో “బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్, బిల్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్, సే నో టూ డ్రగ్స్” నినాదాలతో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు నిర్వహించిన 2కే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన రన్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత తదితరులు జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో కలిసి “సే నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించారు.
భవిష్యత్తును నాశనం చేసే వ్యసనం డ్రగ్స్
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ర్యాలీలో నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్, డీటీఓ జనార్ధన్ రెడ్డి, ఎంవీఐ కిరణ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, డీపీఆర్‌వో అయుబ్ అలీ, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, టీఎస్‌జేయూ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

