కాంగ్రెస్ రాజకీయ కుట్రలు.. బీజేపీ ఆందోళన
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ,నల్లబెల్లి : కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబెల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి–365పై ధర్నా నిర్వహించి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత భవిష్యత్తుతో రాజకీయ లబ్ధి కోసం చెలగాటమాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. నీట్ అంశాన్ని విద్యార్థుల సంక్షేమం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై సభలో చర్చించకుండా రోడ్లపై నిరసనల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సుమారు 27 సార్లు వివిధ నియామక, ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని బీజేపీ ఆరోపిస్తోందని తెలిపారు.అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

