కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యం
హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
అనుబంధ సంఘాల అధ్యక్షులతో డీసీసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం
కాకతీయ, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని డీసీసీ సమావేశ మందిరంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల (ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్) జిల్లా అధ్యక్షులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు వెన్నెముకలాంటివని పేర్కొన్నారు. మహిళలు, యువజనులు, మైనారిటీలు, కార్మికులు, వైద్యులు, ఎస్సీ విభాగం తదితర అన్ని అనుబంధ సంఘాలు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజా సమస్యలపై పార్టీ తరఫున ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు, మండల స్థాయిల్లో అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్‌పర్సన్ బంక సరళ సంపత్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్. దిలీప్ రాజ్, మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు కూర వెంకట్, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రవణ్, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గోవిందు శ్వేతతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

