రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా
కాకతీయ,నల్లబెల్లి : లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రగూడెం బస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

